అమ్మ కోట‌లో చిన్న‌మ్మ స‌త్తా

0

తమిళనాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్‌కే నగర్‌ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు గట్టి షాక్‌ తగిలింది. శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్‌.. ఆ రెండు పార్టీల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌కే నగర్‌ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్‌ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్‌ 21న ఆర్‌కే నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్‌ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రౌండులోనూ కనీసం 2 వేల ఆధిక్యంతో ముందంజలో నిలిచారు. ఆర్‌కే నగర్‌ నియోజకవర్గంలో మొత్తం 2,28,234 ఓట్లు ఉండగా 1,76,885 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 89,013 (50.32 శాతం) ఓట్లను దినకరన్‌ గెలుచుకున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 48,306 (27.31శాతం), డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కు 24,651 (13.94శాతం) ఓట్లు పోలయ్యాయి. నామ్‌ తమిళర్‌ కట్చికి 3,860 ఓట్లు, బీజేపీకి 1,417 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 2,373 ఓట్లు దక్కడం విశేషం. ఉప ఎన్నికల్లో దినకరన్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండాకుల గుర్తును సీఎం కె.పళని స్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్‌ సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తుపై బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం దినకరన్‌ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్‌ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా..
అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే సమయంలో దినకరన్‌కు శశికళ అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్టు చేశారు. అనంతర పరిణామాల్లో దినకరన్, శశికళను పక్కనపెట్టి పళని, పన్నీరు వర్గాలు ఈ ఏడాది ఆగస్టులో ఏకమయ్యారు. దీంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దినకరన్‌ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత ఉన్న సమయంలో పార్టీ నియామకాలు, ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చల్లో దినకరన్‌ కీలక పాత్ర పోషించారు. 1999లో పెరియాకులం నుంచి లోక్‌సభకు, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇదిలా ఉండ‌గా పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది.

Share.

Leave A Reply

%d bloggers like this: