ఆస్తి కోసం బిడ్డ‌ల‌కు విష‌మిచ్చి..తానూ తాగాడు

0

పిల్ల‌లు మృతి.. ఆస్ప‌త్రిలో తండ్రి
చిత్తూరులో విషాదం
ఆస్తి కోసం ఇద్దరు బిడ్డలకు పురుగుల మందు తాగించి, తానూ తాగాడు. బిడ్డలిద్దరూ చనిపోగా.. తాను మాత్రం ఆస్పత్రిలో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ దారుణ సంఘటన చిత్తూరులో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చిత్తూరు గిరింపేటలో నివాసం ఉంటూ.. దుర్గమ్మ గుడి వద్ద చిల్లర దుకాణం నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి అలియాస్‌ చలపతిరెడ్డి(42)కి భార్య చనిపోగా.. ఇద్దరు కుమార్తెలు యోగశ్రీ(16), కుసుమతి(11) ఉన్నారు. అయితే పిల్లలను మాత్రం నగరంలోని ఓటిచెరువులో ఉంటున్న చంద్రశేఖర్‌రెడ్డి తల్లిదండ్రులైన పుష్ప, ఆనందరెడ్డిలు తమ వద్దే ఉంచుకుని చదివిస్తున్నారు. యోగశ్రీ ఇంటర్‌ చదువుతుండగా, కుసుమతి ఐదో తరగతి చదువుతోంది. వ్యసనాలకు బానిసైన చంద్రశేఖర్‌రెడ్డి ఏడాదిన్నరగా ఆస్తి తన పేరుపై రాసివ్వాలని తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మనవరాళ్ల చదువులు పూర్తయ్యాకే రాసిస్తామని వారు చెప్పడంతో ఒక్కోసారి తల్లిదండ్రులపై చేయి చేసుకునే వాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి కూడా తల్లిదండ్రులతో ఘర్షణ పడ్డాడు. వారిని ఇంటి నుంచి గెంటేశాడు. చుట్టుపక్కల గుమికూడగా.. ఆ సమయంలో విధుల్లోని బ్లూకోల్ట్స్‌ సిబ్బంది దీన్ని గమనించారు. చంద్రశేఖర్‌రెడ్డిని, ఆయన తల్లిదండ్రులకు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి, విచారించారు. ఆస్తి కోసం గొడవ చేస్తున్నాడని తల్లిదండ్రులు చెప్పడంతో పోలీసులు సర్దుబాటు చేశారు. అప్పటికే రాత్రి 10.30 గంటలకుపైగా కావడంతో ఉదయం మాట్లాడుకుందామని వారిని పంపేశారు. రాత్రి 11 గంటల సమయంలో కుమార్తెలిద్దరినీ చంద్రశేఖర్‌రెడ్డి బలవంతంగా తల్లిదండ్రుల వద్ద నుంచి తీసుకెళ్లిపోయాడు. శనివారం తెల్లవారుజామయ్యేసరికి చిత్తూరు మండలం బంగారెడ్డిపల్లెలోని చెరువు సమీపంలో ముగ్గురూ పురుగుల మందు తాగి పడి ఉన్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు 108 అంబులెన్స్‌ ద్వారా చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే ఇద్దరు బాలికలు మృతి చెందగా.. చంద్రశేఖర్‌రెడ్డి కొన ఊపిరితో కోమాలోకి వెళ్లిపోయాడు. అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు. విషయం తెలుసుకున్న అవ్వ తాతలు ఆస్పత్రికి చేరుకుని బాలికల మృతదేహాలను చూసి బోరున విలపించారు. మరోవైపు ఓటిచెరువులో విషాదఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు వెస్ట్‌ సీఐ ఆదినారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. చంద్రశేఖర్‌రెడ్డి ప్రవర్తన తొలి నుంచీ సరిగా లేదని స్థానికులు తెలిపారు. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, మద్యం తాగి భార్యను కొట్టడం చేసేవాడని అన్నారు. చివరకు భార్య అనుమానాస్పద స్థితిలో ఇంట్లోనే మృతి చెందిందన్నారు. అయితే కడుపునొప్పి భరించలేక ఆమె చనిపోయినట్లు కుటుంబీకులను నమ్మించాడని ఆరోపించారు. భార్య చనిపోయాక మరింత దిగజారి పోయాడని వివరించారు.
బాధితులను పరామర్శించిన నన్నపనేని
బాలికలు మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి శనివారం సాయంత్రం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. బాలికల అవ్వతాతలను పరామర్శించారు. వారికి కొంత నగదు అందజేశారు. నన్నపనేని వెంట మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ సుజి తదితరులు వున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: