ఎస్వీబీసీ స్టూడియో నిర్మాణ వ్యయం రెండింతలు

0

ప్రణాళికలో లెక్క తప్పిన ఇంజినీరింగ్‌ విభాగం
టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌ (ఎస్వీబీసీ) కార్యకలాపాల కోసం శాశ్వత ప్రాతిపదికన ఓ స్టూడియో నిర్మించాలని దేవస్థానం గతంలో నిర్ణయించింది. ఇందుకయ్యే వ్యయాన్ని, అంచనాల్ని తయారు చేయాల్సిందిగా ఇంజినీరింగ్‌ విభాగానికి బాధ్యత అప్పగించింది. స్టూడియో నిర్మాణాలపై అవగాహన లేని ఈ విభాగం అధికారులు.. తమ పరిధిలో నిర్మించే సత్రాలు, డార్మెటరీల మాదిరిగానే ప్రణాళికలు రూపొందించి.. అంచనాలు తయారు చేసి ఇచ్చారు. ఆ ప్రకారమే టీటీడీ అధికారులు నిధులు కేటాయించారు. ఆ నిధులు సరిపోక, స్టూడియో నిర్మించలేక, టెండర్లు రద్దు చేయలేక, ముందుకు సాగలేక, వెనక్కి తగ్గలేక ఏటూ పాలుపోని స్థితిలో పడ్డారు అధికారులు. ఎస్వీబీసీలో ప్రసారమయ్యే కార్యక్రమాల కోసం బయటి స్టూడియోలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. తిరుపతిలోనే చిత్రీకరణ జరపాలన్నది తితిదే సంకల్పం. ఇక్కడ షూటింగ్‌, రికార్డింగ్‌, ప్రొడక్షన్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వ్యవహారాలు పూర్తి చేస్తే.. ప్రసారాలు వేగంగా, నాణ్యంగా చేయవచ్చని అధికారులు భావించారు. బయటి స్టూడియోలకు అద్దెలు, ఇతర ప్రొడక్షన్‌ ఖర్చులు తగ్గించుకోవచ్చని సొంత స్టూడియో నిర్మాణంపై దృష్టి సారించారు. అలిపిరి నుంచి జూపార్కుకు వెళ్లే దారిలోని నమూనా ఆలయం పక్కనే తితిదేకు చెందిన ఎకరంన్నర స్థలాన్ని ఇందుకు కేటాయించారు. ఐదు అంతస్తుల భవనంలో స్టూడియో, డబ్బింగ్‌ థియేటర్‌, ఎడిటింగ్‌ సూట్లు ఇతర విభాగాలు ఉండేలా ఆకృతులు తయారు చేశారు. ఈ మొత్తం నిర్మాణానికి టీటీడీ ఇంజినీర్లు రూ.14.50 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు వేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ సొమ్ముకు తితిదే అధికారులు ఆమోద ముద్ర వేసి.. పరిపాలన అనుమతులు ఇచ్చారు. నిధులు విడుదలా అయిపోయింది.
కొత్త చిక్కులు…
ఇంజినీరింగ్‌ అధికారులు ఇచ్చిన డిజైన్‌ ప్రకారం ఇటీవలే స్టూడియో నిర్మాణం వేగం అందుకుంది. లోపలి గదులు, థియేటర్‌ నిర్మాణం, ఎలక్ట్రిక్‌ పరికరాల అమరిక, సాంకేతికత వినియోగానికే టీటీడీ కేటాయించిన డబ్బులు ఊడ్చుకుపోయేలా ఉందని తేలింది. నిధులు సరిపోవన్న సంగతి అర్థమవడంతో అధికారులు మీమాంసలో పడ్డారు. నష్ట నివారణ చర్యగా.. ఇలాంటి నిర్మాణాలు చేపట్టడంలో అనుభవమున్న ఓ కన్సల్టెన్సీని అధికారులు సంప్రదించారు. తితిదే అవసరాలకు అనుగుణంగా స్టూడియో నిర్మించాలంటే.. రూ.31 కోట్లు అవుతుందని వారు అంచనా వేశారు. టీటీడీ ఇంజినీరింగ్‌ విభాగం ఇందులో సగానికే అంచనా వేయడం గమనార్హం. టీటీడీ సిబ్బంది ఎలక్ట్రికల్‌ ఖర్చులకు రూ.2 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తే.. కన్సల్టెన్సీ రూ.9 కోట్లు అవుతుందని చెప్పింది. సౌండ్‌ప్రూఫ్‌ గదులు, డబ్బింగ్‌ థియేటర్లకు తితిదే వేసిన అంచనా, ప్రైవేటు కన్సల్టెన్సీ వేసిన అంచనాకు పొంతన లేదు. తితిదే సిబ్బంది సాధారణ సత్రాలకు వేసే అంచనాలు వేశారని.. అవి స్టూడియోలకు పనికి రావన్నది కన్సల్టెన్సీ సూచన.
రెండో దశలో అయినా…
స్టూడియో నిర్మాణానికి ఇప్పటికే రూ.14.50 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చిన టీటీడీ అధికారులు మళ్లీ దీన్ని సవరించాలని భావించడం లేదు. ప్రస్తుతం విడుదల చేసిన డబ్బుతో స్టూడియోను తాత్కాలికంగా అయినా నిర్మించి, అందులోకి కొని విభాగాలను తరలించాలని, మిగిలిన పనులను రెండో దశలో చేపట్టాలని యోచిస్తున్నారు. ఆ పనులకు మళ్లీ కొత్తగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఆ పనులు ఎప్పటికి ప్రారంభిస్తారన్నది తేలాల్సి ఉంది. ముందుగానే టీటీడీ అధికారులు కన్సల్టెన్సీని, నిపుణులను సంప్రదించి ఉంటే.. ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదన్న వాదన విన్పిస్తోంది. తక్కువ నిధులతోనే నిర్మించవచ్చన్న వాస్తవ విరుద్ధ అంచనాలతో మొత్తం ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ఇంజినీరింగ్‌ సిబ్బంది తీరుపై ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నట్ల సమాచారం

Share.

Leave A Reply

%d bloggers like this: