క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో కులపోరు

0

శాసనసభ ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకలో కుల రాజకీయం తారా స్థాయికి చేరింది. లేదులేదంటూనే ప్రధాన పార్టీలన్నీ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేశాయి. జనాబా పరంగా ఎక్కువ మంది ఉన్న లింగాయత్, ఒక్కళిక సామాజిక వర్గాలకు టికెట్లివ్వడంలో కాంగ్రెస్, బీజేపీ పోటీ పడ్డాయి. ఏ సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లిచ్చారు. ఓ సారి చూద్దాం..
కర్ణాటకలో ఎవరెన్ని సిద్ధాంతాలు, అభివృద్ధి నినాదాలు వల్లించినా రాజకీయాలన్నీ చివరకు కులం చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ గాలీ లేకపోవడంతో ప్రస్తుత ఎన్నికలు కులం-డబ్బు చుట్టే తిరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్‌ను దెబ్బతీస్తున్నా అది మిగతా రెండు పక్షాలకు భారీ గా మేలుచేసే పరిస్థితి లేదు. అందుకే కులాల లెక్కలు కీలకమయ్యాయి. ప్రధాన పార్టీలన్నీ రెండు బలమైన కులాలకు టికెట్ల కేటాయింపులో పెద్దపీట వేశాయి. కాంగ్రెస్‌, బీజేపీ, జేడీ(ఎస్‌)… మూడూ దక్షిణ కర్ణాటకలో ప్రాబల్యం కలిగిన ఒక్కళిగలకు, ఉత్తర కర్ణాటకలో ప్రాబల్యం కలిగిన లింగాయత్‌లకు కలిపి 45 శాతం టికెట్లు ఇచ్చాయి. నిజానికి రెండు కులాల జనాభా కలిపి రాష్ట్ర జనాభాలో 31 శాతమే. మూడు పార్టీల నుంచి రెండు కులాలకు దక్కిన టికెట్లు 297. అంటే, 224 సీట్లున్న శాసనసభలో ఒక్కో పార్టీ వందేసి సీట్లను ఈ రెండు కులాలకు కేటాయించిందన్నమాట. గెలిచే సామర్థ్యాన్ని చూసి టికెట్లు ఇచ్చామని మూడు పార్టీలు చెబుతున్నా అగ్రకులాల ఆధిపత్యాన్ని అంగీకరించడమేనని ఓబీసీలు అంటున్నారు.
త్రిముఖ పోరు
రాష్ట్రంలో త్రిముఖ పోటీ జరుగుతున్నది 50 సీట్లలోనే. మిగతా 174 సీట్లలో కాంగ్రెస్-బీజేపీ లేదా కాంగ్రెస్-జేడీ(ఎస్)ల మధ్య ముఖాముఖి జరగనుంది. అలా చూస్తే రెండు ప్రాబల్య కులాలు వందకు మించిన సీట్లలో గెలిచే అవకాశం ఉందని అంచనా. నిజానికి అగ్రకుల ఓట్లపై అతి తక్కువగా ఆధారపడుతున్న కాంగ్రెస్‌ కూడా ఈ రెండు కులాలకు 95 టికెట్లు ఇవ్వడం గమనార్హం. కురుబ కులానికి చెందిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య పూర్తిగా విజయం కోసం దళిత, మైనారిటీ, ఓబీసీ కులాలనే నమ్ముకున్నారు. తన ఐదేళ్ల పాలనలో ప్రాబల్య కులాలు రెండింటినీ పట్టించుకోలేదు. పైగా లింగాయత్‌ల్లో ఒక వర్గానికి మైనారిటీ హోదా ఇవ్వాలని ప్రతిపాదించి కులాన్ని చీల్చే ప్రయత్నం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్‌ పార్టీ కూడా ఆ రెండు కులాలకు అత్యధిక టికెట్లు ఇవ్వక తప్పలేదు. రాష్ట్ర జనాభాలో పాతిక శాతం వరకు ఉన్న ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉండటంతో అన్ని పార్టీ లూ వారికి తగిన ప్రాధాన్యం ఇస్తున్నాయి. నేతలు ఎన్ని అభివృద్ధి కబుర్లు చెబుతున్నా లెక్కలన్నీ కులాల లెక్కలేనని అంటున్నారు. లింగాయత్‌ ఓటర్లను ఆకర్షించేందుకే బీజేపీ అవినీతి కేసుల్లో జైలుకు కూడా వెళ్లొచ్చిన యడ్యూరప్పను పార్టీలోకి ఆహ్వానించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెట్టిందని చెబుతున్నారు. కాంగ్రెస్‌ కూడా కురుబ నేత సిద్దరామయ్య నేతృత్వంలో ఓబీసీ ఓట్లపై పెద్ద ఎత్తున నమ్మకం పెట్టుకుంది. సిద్దరామయ్యకు ఉన్నత పదవి ఇవ్వడం వల్లే ఓబీసీలు కాంగ్రెస్‌కు దన్నుగా నిలబడ్డారనేది కాదనలేని సత్యం. జేడీ(ఎస్‌) పూర్తిగా ఒక్కళిగల ఓట్లను నమ్ముకొని పోరాడుతోంది. 75 లక్షల మంది ముస్లిం ఓటర్ల కోసం కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌) హోరాహోరీ పోరాడుతున్నాయి. బీజేపీని ఓడించేందుకు ఈ వర్గం కాంగ్రెస్‌, జేడీ(ఎస్‌)లలో ఏదో ఒక బలమైన పార్టీని ఎంచుకుంటుందని భావిస్తున్నారు. ఇక బీజేపీ ఓబీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తోంది.
ఏకులానికి ఎన్ని టికెట్లు.
ఇక ఏ ఏ పార్టీలు ఎవరెవరికి ఎక్కువ సీట్లిచ్చాయో చూద్దాం. లింగాయత్‌లకు కాంగ్రెస్ 49 సీట్లిచ్చింది. బీజేపీ అత్యధికంగా 68 నామినేషన్లు కట్టబెట్టింది. జేడీఎస్ కూడా తక్కువేమీ తినలేదు. లింగాయత్ లకు ఆ పార్టీ 41 స్థానాలిచ్చింది. ఒక్కళిగల విషయానికి వస్తే ఆ సామాజిక వర్గానికి చెందిన 46 మందికి కాంగ్రెస్ టికెట్లు దక్కాయి. 38 మంది ఒక్కళిక సామాజిక వర్గం వారికి కమలం పార్టీ నామినేషన్ అందింది. జేడీఎస్ నుంచి 55 మంది ఒక్కళిగలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున 35 మంది ఎస్సీలు ఎన్నికల బరిలో ఉన్నారు. కాషాయ పార్టీ తరపున 37 మంది ఎస్సీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జెడీఎస్ తరపున 31 మంది ఎస్సీలున్నారు. ఇక గిరిజనుల విషయానికి వస్తే కాంగ్రెస్, బీజేపీలో చెరి 17 మంది ఎస్టీ అభ్యర్థులున్నారు. జేడీఎస్ తరపున 11 మంది గిరిజనులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున 17 మంది, జేడీఎస్ తరపున 19 మంది ముస్లింలు బరిలోకి దిగారు. బీజేపీ ఒక్క ముస్లింకు కూడా టికెట్టివ్వలేదు. కురుబ సామాజిక వర్గానికి చెందిన 17 మందికి కాంగ్రెస్ నామినేషన్ దక్కింది. బీజేపీ తరపున కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆరుగురు పోటీ చేస్తున్నారు. జేడీఎస్ లో 14 మంది కురుబలున్నారు. కాంగ్రెస్ ఆరుగురు బ్రాహ్మణులకు టికెట్లిస్తే, బీజేపీ 9 మందికి టికెట్లిచ్చింది. జేడీఎస్ తరపున ముగ్గురు బ్రాహ్మణ సామాజిక వర్గం వారు బరిలో ఉన్నారు. ఇతర సామాజిక వర్గాల నుంచి 39 మంది కాంగ్రెస్ టికెట్ పొందారు. 49 మంది బీజేపీ నామినేషన్ అందుకున్నారు. 47 మంది జేడీఎస్ టికెట్లు పొందారు.

Share.

Leave A Reply

%d bloggers like this: