గోదావ‌రి టు కావేరి వ‌యా తెలంగాణ

0

దక్షిణ భారతదేశంలో నదుల అనుసంధానంపై కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అంతర్రాష్ట్ర జల వివాదాలు, ముంపు సమస్యల్లో చిక్కుకుపోయిన ఈ ప్రక్రియకు జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. మూడు రాష్ట్రాల్లో లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీటితోపాటు పరీవాహక ప్రాంతాల్లోని వారికి తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చేలా కొత్త ప్రతిపాదనలను రూపొందించింది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించాలని ప్రతిపాదించింది. అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని సూచించింది. దీనికి మొత్తంగా రూ.45,049 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ మేరకు సాంకేతిక సాధ్యాసాధ్యాల ప్రతిని (టెక్నికల్‌ ఫీజబులిటీ నోట్‌) సిద్ధం చేసింది.

కొత్త అధ్యయనం.. కొంగొత్త అధ్యాయం!
దక్షిణాదిలో నదుల అభివృద్ధి కోసం ద్వీపకల్ప నదుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఒడిశాలోని మహానది నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని గోదావరి, కృష్ణాలను కలుపుతూ తమిళనాడు, కర్ణాటక పరిధిలోని కావేరి నది వరకు అనుసంధాన ప్రక్రియను చేపట్టింది. అదనపు జలాల లభ్యత ఉన్న నదుల నుంచి ఇతర నదులకు నీటిని తరలించాలని నిర్ణయించింది. మహానదిలో సుమారు 360 టీఎంసీలు, గోదావరిలో 530 టీఎంసీల మేర మిగులు జలాలు ఉన్నట్లుగా అంచనాలున్న దృష్ట్యా… ఆ నీటిని కృష్ణా, కావేరి పరీవాహకాలకు తరలించాలన్నది కేంద్ర ప్రయత్నం.

ఇందుకోసం తొలుత తెలంగాణ పరిధిలోని ఇచ్చంపల్లి (గోదావరి)–నాగార్జునసాగర్‌ (కృష్ణా), ఇచ్చంపల్లి–పులిచింతల ప్రాజెక్టులను అనుసంధానించి గోదావరి నీటిని కృష్ణాకు తరలించాలని ప్రతిపాదించింది. కానీ ఈ నిర్ణయాన్ని ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా తప్పుపట్టాయి. దాదాపు ఏడాది పాటు మరుగున పడిన ఈ అంశం తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో తిరిగి తెరపైకి వచ్చింది. అయితే ఒడిశాలోని మణిభద్ర ప్రాజెక్టు, తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న ఇచ్చంపల్లి ప్రాజెక్టులు నిర్మించలేని పరిస్థితిలో ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేసింది. ఇచ్చంపల్లికి 74 కిలోమీటర్ల దిగువన ఇంద్రావతి ఉపనది గోదావరిలో కలిశాక అకినేపల్లి వద్ద సుమారు 716 టీఎంసీలు లభ్యతగా జలాలు ఉంటాయని లెక్కించింది. అందులో తెలంగాణ, ఏపీలు తమ ప్రాజెక్టులకు వినియోగించుకోగా.. 324 టీఎంసీల మేర మిగులు జలాలు ఉంటాయని అంచనా వేసింది. దీంతో అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి నాగార్జునసాగర్‌కు నీటిని తరలించేలా ప్రణాళిక వేసింది. ఈ కాలువ పెద్దవాగు, కిన్నెరసాని, మురేడు. పాలేరు, మూసీ నదులను దాటి వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.

Share.

Leave A Reply

%d bloggers like this: