జాలి గుండే సావిత్రికి శాపం

0

అప్పట్లో రూ.32 వేలిచ్చి దండకొన్న సావిత్రి!
‘మహానటి’ సావిత్రి.. చక్కటి హావభావాలు పలికించడమే కాదు అడిగిన వారికి కాదనకుండా సహాయం చేయడం కూడా బాగా తెలుసు. ఆమెది ఎంతో జాలి గుండె. అందుకే సంపాదించిన లక్షలు ఏవీ కూడా మిగుల్చుకోలేకపోయారు. ఆ రోజుల్లో ఆమె ఇంటి ఖర్చే నెలకు అర లక్ష ఉండేది. కుడి చేత్తో ఇచ్చింది.. ఎడమ చేతికి తెలియకుండా దానం చేసేవారు. విరాళాలూ అలాగే ఉండేవి. అందుకే ఉదాహరణే ఈ ఘటన. 1972లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పి.వి. నరసింహారావు ముఖ్యమంత్రి. ఏదో పనిమీద జనవరి నెలలో ఆయన మద్రాసు వచ్చారు. సవేరా హోటల్లో సినిమా ప్రముఖులంతా ఆయనకు తేనీటి విందు ఇచ్చారు. బంగ్లాదేశ్‌ సమస్యపై పాకిస్థాన్‌ యుద్ధం జరుగుతున్న రోజులవి. దేశరక్షణ నిధికి సినిమావారంతా భారీ ఎత్తున విరాళాలు ఇవ్వాలని పి.వి. ఆ సమావేశంలో కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన దక్షిణభారత చలన చిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఎ.ఎల్‌. శ్రీనివాసన్‌ వెంటనే.. సినిమా ప్రముఖులు పి.వి.కి వేసిన పూలదండను వేలం పాట పెట్టారు. సావిత్రి రూ.32 వేలు ఇచ్చి వేలంలో ఆ దండ కొన్నారు. కిలో బియ్యం రూపాయికి దొరుకుతున్న రోజుల్లో దేశరక్షణ నిధికి ఆమె చూపిన వితరణ అది. ఆ సమావేశంలో చాలా మంది స్థితిమంతులు ఉన్నారు. అయినా సావిత్రే గెలిచారు. ఆమె పెద్ద మనసుకు సంతోషించిన పి.వి. ఆ దండను ఆమె మెడలోనే వేశారు. సావిత్రిది ఎడమ చెయ్యి వాటం. ఆ చేత్తోనే రాసేవారు. ఆలిండియా లెఫ్ట్‌హ్యాండ్‌ రైటర్స్‌ అసోసియేషన్‌కి ఆనరరీ ప్రెసిడెంటు. ‘మనిషికి హృదయం ఎడమవైపు ఉంటుంది. మేము ఎడమ చెయ్యితో రాస్తాం. మా రాతకీ, హృదయానికీ దగ్గర సంబంధం ఉంటుంది. మా రాతల్లో చిత్తశుద్ధి ఉంటుంది’ అని ఆమె అనేవారు. సంపద ఉన్ననాడు ఎలా ఉన్నారో లేనినాడూ సావిత్రి అలానే ఉన్నారు. డబ్బు పోతోందన్న చింత ఏ మాత్రం ఉండేది కాదు. బాధల్లా మనుషులూ, వాళ్ల నైజాల గురించే. పాపం అని ఎవరైనా జాలి తలిస్తే ఏ మాత్రం సహించేవారు కాదు. ‘అయామ్‌ ఆల్‌రైట్‌’ అని ఖరాకండీ గా చెప్పేసేవారు. ‘నాలుగిళ్లు ఉన్ననాడు కూడా నేను ఉన్నది ఒక్కింట్లోనే కదా’ అనేవారు. ‘ఈ డబ్బు, మేడలూ, మిద్దెలూ, కార్లూ ఏవీ నికరం కాదు. మనవెంట ఏవీ రావు. మనతో వచ్చేవేవో వాటిని సంపాదించుకుంటే చాలు’ అనేవారు. అన్నట్టుగానే వాటినే పుష్కలంగా మూటగట్టుకున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: