త‌ల్లిని, ఊరిని చూస్తాన‌నుకోలేదు

0

కన్నతల్లిని, పుట్టిన ఊరిని మళ్లీ చూస్తానని అనుకోలేదని మావోయిస్టు మాజీ నేత జినుగు నర్సింహారెడ్డి అలియాస్‌ జంపన్న అన్నారు. జంపన్న భార్య రజితతో కలసి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మండలంలోని తన స్వగ్రామమైన చెర్లపాలెంకు మంగళవారం వచ్చారు. గ్రామస్తులు, బంధువులు, స్నేహితులతో సాయంత్రం వరకు గడిపారు. జంపన్న విలేకరులతో మాట్లాడుతూ రాజకీయాలపై విముఖత ఏమీ లేదని, అలాగని ఇష్టం కూడా లేదన్నారు. రాజకీయాల్లో చేరతారా అని అడుగుతున్నారని దీనికి త్వరలో సమాధానమిస్తానన్నారు. ప్రజల కోసమే తన జీవితం అంకితమన్నారు. ప్రజల కోసమే అజ్ఞాతవాసం చేశానని, తల్లిని, తండ్రిని ఒక్కసారైనా చూసేందుకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. జంపన్న దంపతులకు గ్రామంలో ఘనస్వాగతం లభించింది.
33 ఏళ్ల తర్వాత..
జంపన్న 33 ఏళ్ల తర్వాత తన చిన్ననాటి స్నేహితులను, బంధువులను కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 10వ తరగతి అనంతరం గ్రామాన్ని వీడిన జంపన్న సుదీర్ఘ విరామం తర్వాత ఇక్కడికి వచ్చారు. గ్రామ ఆడపడుచులు ఆ దంపతులకు బొట్టుపెట్టి గ్రామంలోకి ఆహ్వానించారు. గ్రామంలోకి రాగానే జంపన్న బాబాయ్‌ మోహన్‌రెడ్డి ఆప్యాయంగా కౌగిలించుకుని ఉద్విగ్నతకు లోనయ్యాడు. ఇన్ని రోజులు ఏమై పోయావు బిడ్డా అని కన్నీటిపర్యంతమయ్యాడు. బంధువులతో కలసి భోజనం చేశారు. తాను నివసించిన ఇల్లును పరిశీలించాడు.

Share.

Leave A Reply

%d bloggers like this: