దేశానికే వెలుగు తెలుగు

0

దేశానికే వెలుగు తెలుగు
‘‘సజీవ భాష తెలుగు. ఇది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ మహత్తర దేశ పురోగతిలో తెలుగు వారి పాత్ర ఎనలేనిది. దేశ స్వాతంత్య్ర
సంగ్రామంలో తెలుగు బిడ్డల కృషి మహత్తరమైనది. దేశ సాహిత్యంలోనే గాక మానవ నాగరిక పరిణామ క్రమంలోనూ తెలుగు భాషకు విశిష్ట స్థానముంది. ఈ భాషా ప్రావీణ్యం ఖండాంతరాలు దాటి గొప్పగా వర్ధిల్లుతూ, తనకు ఎల్లలు లేవని నిరూపించింది. తెలుగువారు దేశ సరిహద్దులు దాటుకు వెళ్లి ప్రపంచ పురోగతిలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ సీఈఓగా గొప్పగా రాణిస్తున్న తెలుగు తేజం సత్య నాదెళ్లే ఇందుకు నిదర్శనం’’అంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రశంసించారు. దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాషగా ఖ్యాతి పొందిన తెలుగు మున్ముందు మరింతగా తేజరిల్లుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు ఖ్యాతిని సుస్థిరం చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించిందని శ్లాఘించారు. దేశ విదేశాలకు చెందిన తెలుగు భాషాభిమానుల మధ్య ఐదురోజుల పాటు కన్నులపండువగా సాగిన ఈ మహాసభల ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నందుకు ఎంతో ఆనందిస్తున్నానన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక జరిగిన తొలి ప్రపంచ తెలుగు మహాసభలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల పాటు వైభవంగా సాగిన సభల ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లాల్‌బహదూర్‌ క్రీడామైదానంలోని పాల్కురికి సోమన ప్రాంగణం పోతన వేదికలో జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి… తెలుగు భాష ప్రాధాన్యాన్ని, తెలుగు సాహితీవేత్తల వైభవాన్ని, తెలంగాణ ప్రముఖులను తన ప్రసంగంలో ఆద్యంతం స్మరించుకున్నారు.

తెలుగులో ప్రసంగం ప్రారంభం…
రాష్ట్రపతి తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘సోదర సోదరీమణులారా నమస్కారం, దేశభాషలందు తెలుగు లెస్స’అని ఆయన అనగానే ప్రాంగణంలో కిక్కిరిసిన భాషాభిమానులు పెద్దపెట్టున చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రపతి ఆంగ్లంలో ప్రసంగాన్ని కొనసాగించారు. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి హైదరాబాద్‌ వచ్చానని గుర్తు చేసుకున్నారు. ‘‘42 దేశాల నుంచి తెలుగు భాషాభిమానులు సభలకు తరలి వచ్చారని తెలిసి అబ్బురపడ్డాను. తెలుగువాడైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సభలను ప్రారంభించటం సంతోషాన్నిచ్చింది. ఐదు రోజుల పండుగతో మహత్తర తెలుగు భాషకు జనం ఘనంగా నీరాజనం పలికారు’’అంటూ అభినందించారు.

తెలుగువారు దేశానికెన్నో ఇచ్చారు
తెలుగులో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక సాహితీ ప్రతిభ ఉండటం అభినందనీయమంటూ రాష్ట్రపతి ప్రస్తుతించారు. శ్రీకృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తిగానే గాక తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసి ఆ భాషకు విశిష్టమైన గుర్తింపు తెచ్చారన్నారు. ‘‘తెలుగువారైన సర్వేపల్లి రాధాకృష్ణన్, వి.వి.గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతులుగా దేశానికి గొప్ప సేవ చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు వాడైనందుకు ఈ నేల ధన్యమైంది. నన్నయ వెయ్యేళ్ల క్రితమే తెలుగు వ్యాకరణ నియమాలు రూపొందించారు. మహా భారతాన్ని తెలుగీకరించారు. శతాబ్దంలో గురుజాడ అప్పారావు సంఘ సంస్కర్తగా దేశానికే గొప్ప సేవ చేశారు. రచనలతో ప్రజల్లో చైతన్యం తెచ్చారు. ఇక సామాన్య ప్రజలో నిలదీసే తత్వాన్ని శ్రీశ్రీ తన అక్షరాలతో నూరిపోశారు. వట్టికోట అళ్వార్‌ స్వామి, దాశరథి వంటి దిగ్ధంతులెందరో సాహిత్యంతో పాటు సమాజానికీ సేవ చేశారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి త్యాగయ్య తెలుగు కృతులే కీలకం. ఇక భక్తి పారవశ్యానికి అన్నమయ్య కీర్తనలు ఊతం. అడవి బిడ్డల హక్కుల కోసం ఉద్యమించిన కుమ్రం భీం, అంటరానితనంపై పోరాడిన భాగ్యరెడ్డి వర్మ , జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, ఆంగ్లేయులను వణించిన అల్లూరి, సామాజిక, రాజకీయ వ్యవస్థపై సామూహిక ఉద్యమానికి తెరతీసిన స్వామి రామానంద తీర్థ.. ఇలా ఒకరేమిటి, తెలుగువారు ఈ దేశానికి ఎన్నో ఇచ్చారు’’అంటూ ప్రశంసించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: