ద‌ళిత మ‌హిళ‌ను అవ‌మానించిన నిందితుల‌కు రిమాండ్

0

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జెర్రిపోతులపాలెంలో ఓ దళిత మహిళను వివస్త్రను చేసి, ఆమెతోపాటు ఇతర దళితులపై గత మంగళవారం దాడికి పాల్పడ్డ అధికార తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం ఏడుగురిని శుక్రవారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో టీడీపీకి చెందిన పెందుర్తి మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు మడక పార్వతి, ఆమె భర్త మడక అప్పలరాజు, మాజీ సర్పంచ్‌ వడిశల శ్రీను, రాపర్తి గంగరాజు, మడక రామునాయుడు, సాలాపు జోగారావు, సాలాపు గంగమ్మ ఉన్నారు. జెర్రిపోతులపాలెంలో ఎన్టీఆర్‌ గృహకల్ప పేరుతో దళితుల భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో హక్కుదారులైన దళితులు వీరిని అడ్డుకోవడంతో రంజా దుర్గమ్మ అనే దళిత మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేయడంతో పాటు దువ్వాడ అక్కమ్మ, ఇతర దళితులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఈ నెల 19న పెందుర్తి పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేయగా సమగ్ర విచారణ అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సీ, ఎస్టీ సెల్‌ విచారణ అధికారి, ఏసీపీ కె. ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ (పీవో) యాక్ట్‌తో పాటు ఐపీసీ 447, 354, 323 సెక్షన్లు నమోదు చేసినట్లు తెలిపారు.

Share.

Leave A Reply

%d bloggers like this: