ద‌ళిత విద్యార్థినిపై అత్యాచారం..నిర‌స‌న‌ల వెల్లువ‌

0

క‌ర్ణాట‌క రాష్ట్రం విజ‌య‌పుర జిల్లాలో కామాంధుల చేతిలో అత్యాచారానికి, హ‌త్య‌కు గురైన ద‌ళిత విద్యార్థిని దాన‌మ్మ‌(15)కి మ‌ద్ద‌తుగా, ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందంటూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. బెంగళూరుతో పాటు బళ్లారి, మండ్య, మైసూరు, శివమొగ్గ, బెళగావి తదితర ప్రాంతాల్లో స్వచ్చంద సంఘాల ప్రతినిధులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. దారుణానికి పాల్పడిన దోషులపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వారిని బహిరంగంగా ఉరి తీయాలంటూ నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళల పరిస్థితి ఎలా ఉందో ఈ ఘటన చాటుతోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాష్టంలో శాంతి, భద్రతలు పూర్తిగా క్షీణించాయని మండిపడుతున్నారు. విజయపుర జిల్లాలో సీఎం పర్యటిస్తున్న సమయంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసు యంత్రాంగం పనితీరుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు.
సీఐడీకి కేసు అప్ప‌గింత‌.
ఆందోళ‌న‌ల‌తో దిగివ‌చ్చిన ప్ర‌భుత్వం ఈ కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఘటనలో దోషులందరినీ వీలైనంత త్వరగా పట్టుకొని శిక్ష పడేలా చూస్తామని తెలిపింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచనల మేరకు ఈ కేసు విచారణను ముమ్మరం చేశారు. ఇక, బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 లక్షల పరిహారాన్ని ప్రకటించగా, జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న ఎం.బి.పాటిల్‌ తన వంతుగా రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అయితే బాధిత బాలిక కుటుంబం మాత్రం తమకు కావాల్సింది ప్రభుత్వం అందించే పరిహారం కాదని, న్యాయం కావాలని కోరుతోంది. బాలిక కుటుంబాన్ని సీఎం సిద్ధరామయ్య కలిసి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబం విలపిస్తూ తమ చిన్నారిని పొట్టనబెట్టుకున్న కామాంధులను కఠినంగా శిక్షించాలని సీఎంను వేడుకున్నారు.
బీజేపీపై సీఎం విమర్శలు
సీఎం సిద్ధరామయ్య మాత్రం బీజేపీ నేతల వ్యాఖ్యలను కొట్టి పారేశారు. ఓ మైనర్‌ బాలిక చావును కూడా బీజేపీ నేతలు రాజకీయాల కోసం వాడుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. బాలిక పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందని, నివేదిక వచ్చిన వెంటనే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని చెప్పారు.

Share.

Leave A Reply

%d bloggers like this: