బిడ్డ‌ల‌తో స‌హా త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌..

0

ఆ తల్లికి ఏం కష్టమో … ఏమో కానీ రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను నీటిపాలుచేసి…ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. పేద కూలీ ఇంట పెనువిషాదం నింపిన ఈ సంఘటన చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ చెడుగుట్లపల్లె వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన పి. వసంతకుమారి(27) బిడ్డలు అఖిల్‌(4), హర్షిత(2)ను గ్రామానికి సమీపంలోని జంగంవానికుంట వద్ద గల ఫాంపాండ్‌ గుంతలో పడేసి ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను కలచివేసింది. ఆ గ్రామం శోకసముద్రమైంది. చెడుగుట్లపల్లెకు చెందిన ఓబులప్ప పెద్ద కుమార్తె పి. వసంతకుమారి, నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన గంగాధర ఐదేళ్ల క్రితం పెళ్లాడారు. గంగాధర తల్లిదండ్రులు మృతిచెందడంతో అత్తగారింట్లోనే ఉంటూ కూలిపనులు చేసి జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా వసంతకుమారి మతిస్థిమితం లేకుండా బాధపడుతోంది. వైద్యసేవలందిస్తే కుదుటపడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడూ బిడ్డలను ప్రేమగా చూసుకునే ఆమె, వారితో కలిసి బలవన్మరణానికి పాల్ప డటమేంటని గ్రామస్తులు, బంధువులు భోరున విలపిస్తున్నారు. బిడ్డలు, భార్య మృతదేహాల వద్ద గంగాధర, అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరుకావడం చూపరులను కలచివేసింది. అఖిల్, హర్షిత మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

Share.

Leave A Reply

%d bloggers like this: