బీజేపీకి వ్య‌తిరేకంగా పోరాడుతా..గుజ‌రాత్ ఎమ్మెల్యే

0

క‌ర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సైతం బీజేపీకి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని దళిత పోరాట నేత, గుజరాత్‌కు చెందిన ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీ వెల్లడించారు. చిక్కమగళూరుకు చెందిన కోము సౌహార్ధ వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిగ్నేష్‌ మెవానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…‘నేను ఏ పార్టీకి మద్దతుగా పనిచేయడం లేదు. నా పోరాటం దళితులు, నిమ్నవర్గాల సంక్షేమం కోసమే. నా పోరాటం మతవాదులను ప్రేరేపించే వారిపైనే’ అంటూ బీజేపీపై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఇక ప్రముఖ పాత్రికేయురాలు గౌరి లంకేష్‌తో పాటు ఎంతో మంది ఉద్యమకారులు, పోరాటవేత్తలతో తనకు పరిచయాలు ఉన్నాయని అన్నారు. ఇక కర్ణాటక ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌ కాబోదని జిగ్నేష్‌ మేవానీ పేర్కొన్నారు. ఇక్కడ బీజేపీ ఆటలు సాగబోవని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్డే వ్యాఖ్యలపై జిగ్నేష్‌ మెవానీ స్పందిస్తూ…‘కర్ణాటకలో మత కలహాలను సృష్టించేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే మేం మాత్రం కర్ణాటకలో స్నేహపూరిత, సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తాం. కర్ణాటక, కేరళలో నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కర్ణాటకలో ఎన్నికల సమయంలో తిరిగి ఇక్కడికి వస్తాను’ అని జిగ్నేష్‌ మెవానీ వెల్లడించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: