విశాల్ హృద‌యం మ‌న హీరోల‌కు ఏదీ?

0

తమిళ సినిమా పరిశ్రలో పెద్ద రేంజికి ఎదిగిన విశాల్ తెలుగువాడన్న సంగతి తెలిసిందే. ఐతే అతడి కుటుంబం ముందు నుంచి చెన్నైలోనే సెటిలైంది. విశాల్ పుట్టింది.. పెరిగింది తమిళనాటే కాబట్టి ఒక తమిళుడిగానే ముద్ర వేయించుకున్నాడతను హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాక నడిగర్ సంఘం.. నిర్మాతల మండలి ఎన్నికల్లో జయకేతనం ఎగురవేసి.. కీలక పదవులు చేపట్టి ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాడతను. అతడి సేవా కార్యక్రమాలు తమిళుల మనసులు చూరగొన్నాయి. అతడిని వ్యతిరేకించిన వాళ్లకు కూడా వాయిస్ లేకుండా చేశాయి. తమిళనాట అమ్ముడయ్యే ప్రతి సినిమా టికెట్ నుంచి ఒక రూపాయి రైతు సహాయ నిధికి వెళ్లేలా నిర్మాతల మండలి అధ్యక్షుడిగా అతను తీసుకున్న నిర్ణయం తమిళనాట ప్రశంసలందుకుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని రైతుల కోసం ఇదే తరహాలో అతను తీసుకున్న ఓ నిర్ణయం శభాష్ అనిపించుకుంది. ఇటీవలే విశాల్ సినిమా ‘ఇరుంబుతిరై’ తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ కూడా అనూహ్యంగా వచ్చాయి. ఇప్పటిదాకా రూ.12 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. ఐతే ఈ సినిమాకు అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి ఒక రూపాయి తీసి.. అలా వచ్చిన ఆదాయాన్ని తెలుగు రాష్ట్రాల్లోని రైతు సహాయ నిధికి ఇవ్వబోతున్నట్లు విశాల్ ప్రకటించాడు. ‘అభిమన్యుడు’ ద్వారా విశాల్ ఇలా సమకూర్చేది కొన్ని లక్షలే కావచ్చు. కానీ ఈ ఆలోచనలోని స్ఫూర్తిని మెచ్చుకోవాలి. కేవలం ఆర్థిక సాయం అందించడమే కాదు.. ప్రజా సమస్యల విషయంలో వాయిస్ వినిపించడంలో కావచ్చు.. పోరాడటంలో కావచ్చు.. విశాల్ కమిట్మెంట్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన తెలుగు హీరోలు అతడిని చూసి చాలా నేర్చుకోవాలి.

Share.

Leave A Reply

%d bloggers like this: