వైఎస్‌.జ‌గ‌న్ ఆరోగ్య‌వ‌రం

0

వైద్యం ఖ‌ర్చు వెయ్యిదాటితే ఆరోగ్య‌శ్రీ వ‌ర్తింపు
పేద‌ల‌ను ఆదుకుంటా
బాబువ‌న్నీ అబ‌ద్దాలు, మోసాలు
క‌దిరి స‌భ‌లో వైఎస్‌. జ‌గ‌న్
వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ పేద‌ల‌కు ఆరోగ్య వ‌రం ఇచ్చారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటే ఏ వ్యాధినైనా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి పేదలందరినీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా ఎక్కడ వైద్యం చేయించుకున్నా ఆరోగ్యశ్రీ వర్తించేలా చూస్తానన్నారు. డాక్టర్ల సూచన మేరకు వ్యాధిగ్రస్తులు తీసుకునే విశ్రాంతి సమయంలోనూ డబ్బు ఇస్తానన్నారు. మూత్రపిండాల జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల పింఛన్‌ ఇస్తానని భరోసా ఇచ్చారు. చంద్రబాబు ప్రజల్ని మోసం చేసేందుకే చంద్రన్న మాల్స్‌ను పెట్టారని ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 42వ రోజు శనివారం సాయంత్రం అనంతపురం జిల్లా కదిరి సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్‌ ప్రసంగించారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం, ఉపాధి పేరిట దారుణ వంచనకు పాల్పడ్డారని, ఫలితంగా ప్రతి ఇంటికీ ఇప్పటికే చంద్రబాబు రూ.90 వేలు బాకీ పడ్డారన్నారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
అధర్మం.. అవినీతి.. మోసం.. అబద్ధాలు
చంద్రబాబు పాలన అంతా అధర్మం, అవినీతి, మోసం, అబద్ధాలే. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్నికల ముందు వందలాది హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి పదవిలో కూర్చునేందుకు చంద్రబాబు నాలుగేళ్ల క్రితం ఇచ్చిన హామీలను నెరవేర్చారా లేదా అన్నది మనమంతా ప్రశ్నించుకోవాలి. జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు ఊదరగొట్టాడు. ఇంటికొకరికి ఉద్యోగం రాకపోతే, ఉపాధి కల్పించకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. రాష్ట్రంలో కోటీ 75 లక్షల ఇళ్లుంటే ప్రతి ఇంటికీ ఒక కరపత్రం పంపించి ఈ విషయం చెప్పాడు. మరి ఇప్పుడు ఇచ్చారా? లేదు. ఇలా ప్రతి ఇంటికి చంద్రబాబు గత 45 నెలల కాలానికి రూ.90 వేలు బాకీ పడ్డారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. ఓటుకు కోట్లు కేసులో ప్రజాప్రతినిధుల కొనుగోలుకు సంబంధించి వీడియో, ఆడియో టేపులతో అడ్డంగా దొరికి పోయి ఆ విచారణ జరక్కుండా ఉండేందుకు ప్రత్యేక హోదాను అమ్మేశాడు.
కదిరికి మంచినీళ్లు మహానేత ఘనతే..
కదిరిలో మంచినీళ్ల బిందె రూ.5, రూ.10 పెట్టి కొనుక్కుంటున్న దశలో నాన్నగారు రూ. వంద కోట్లు కేటాయించి చిత్రావతి నుంచి కదిరికి నీళ్లు తెచ్చారు. అనంతపురం జిల్లా ప్రజలు బాగుండాలని, హంద్రీ– నీవా ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన తీసుకువచ్చి త్వరితగతిన పూర్తి చేయాలని రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి దాదాపు 80 శాతం పని పూర్తి చేశారు. చెర్లోపల్లి రిజర్వాయర్‌ వైఎస్‌ ఘనతా కాదా? వైఎస్‌ మన మధ్య నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ హంద్రీ–నీవా ప్రాజెక్టులో మిగిలిపోయిన 20 శాతం పనులు పూర్తి చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది.
జన్మభూమి కమిటీల మాఫియా..
పైస్థాయిలో చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతుంటే కింది స్థాయిలో గ్రామ గ్రామాన జన్మభూమి కమిటీల పేరిట మాఫియాను తయారు చేశారు. పింఛన్లు కావాలన్నా, రేషన్‌ కార్డులు కావాలన్నా, చివరకు మరుగుదొడ్డి కావాలన్నా లంచాలు ఇవ్వాల్సిందే. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్న సమయంలో ప్ర‌జ‌లు ఆలోచించి ఓటు వేయాలి. మీ ఆశీర్వాదం కావాలి.
అధ్వానంగా ఆరోగ్యశ్రీ పథకం
పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించాలంటే మనమంతా హైదరాబాద్‌కో, మరేదైనా పెద్ద ఆస్పత్రికో వెళ్తాం. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తించదని చంద్రబాబు చెబుతున్నాడు. ఆయన పాలనలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తున్నారు. ప్రతి పేదకూ ఉచితంగా ఎంతటి పెద్ద ఆపరేషన్‌ అయినా చేయిస్తానని మాట ఇస్తున్నా. రూ.1000 ఖర్చు దాటే ప్రతి వైద్యాన్నీ ఆరోగ్యశ్రీ పథకం కిందకు తీసుకువచ్చి వైద్యం చేయిస్తా. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా ఎక్కడైనా సరే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాం. డెంగీ, మలేరియా లాంటి వ్యాధులన్నింటినీ ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి చికిత్స చేయిస్తాం. డాక్టర్‌ సలహా మేరకు రోగి విశ్రాంతి తీసుకునే సమయంలో వారి కుటుంబం గడిచేందుకు డబ్బు ఇస్తాం. తలసేమియా, మూత్ర పిండాలు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న రోగులకు రూ.10 వేలు పింఛన్‌ ఇస్తాం. 108, 104కు ఫోన్‌ కొడితే చాలు వైద్యం అందుబాటులోకి తీసుకొస్తాం. చివరకు 102కు ఫోన్‌ కొడితే మేకలు, ఆవులు, పశువులకు కూడా వైద్యం అందుబాటులోకి తీసుకొస్తానని హామీ ఇస్తున్నా.
విచ్చల విడిగా ఎమ్మెల్యేల కొనుగోలు…
పట్టపగలే రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడు. వారిపై అనర్హత వేటు వేయడు. రాజ్యాంగాన్ని దగ్గరుండి తూట్లు పొడుస్తున్నాడు. చట్టాలను తయారు చేసే చట్ట సభల్లోనే చట్టాలకు తూట్లు పొడుస్తున్నారు. ఎమ్మెల్యేలను కొనడానికి అంత నల్లధనం ఎక్కడి నుంచి వస్తుందని అడిగే నాథుడే లేడు. ఈ వేళ ఏ పార్టీ వాళ్లు మంత్రివర్గంలో ఉన్నారో అందరికీ తెలిసిందే.

Share.

Leave A Reply

%d bloggers like this: