సాయం లేక..రైతు డీలా..

0

తూర్పుగోదావరి జిల్లాలో పలువురు రైతులు ఎన్టీఆర్ జలసిరి పథకం కింద విద్యుత్తు ఆధారిత బోర్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం నుంచి సుమారు రూ.1.19లక్షలు అందుతాయన్న భావనతో పొలాల్లో బోర్లు వేసుకున్నారు. అయితే రైతులు ఆశించినంతగా సత్వరమే ఆర్ధిక సాయం రాలేదు. దీంతో రూ.లక్షల్లో ఖర్చు చేసి బోర్లు వేసుకున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే సొమ్ముల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రతీ రోజూ అధికారుల చుట్టూ తిరుగుతున్న వారూ అధికంగానే ఉన్నారు. తాజాగా సోలార్ ఏర్పాటు చేసుకుంటేనే చేయూతనిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని అధికారులు చెప్తుండడంతో రైతులు తలలుపట్టుకున్నారు. ఈ పథకం కింద జిల్లాలో బోర్లు వేసుకున్న 189 మంది రైతుల పరిస్థితి ఇదే మాదిరిగా ఉంది. బోరు నిర్మాణం, విద్యుత్తు సౌకర్యం కోసం రూ.1.19 లక్షల సాయం చేస్తామని అప్పటి కలెక్టరు అరుణ్కుమార్ సమక్షంలోనే జిల్లా అధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో ఆసక్తి ఉన్న రైతులు ముందుకొచ్చారు. జిల్లాలో 2,429 బోర్లు మంజూరు చేశారు. వాటిలో చాలా నిర్మాణాలు పూర్తయ్యాయి. కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిలో చాలా వరకు సోలార్ బోర్ల నిర్మాణం చేపట్టగా 200 అడుగుల నుంచి 400 అడుగుల లోతున నిర్మించిన బోర్లకు సోలార్ పనిచేయలేదు. దీంతో విద్యుత్తుతో నడిచే బోర్లు నిర్మించుకున్నారు.
విద్యుత్తు ఆధారిత బోర్లు నిర్మించుకున్న, నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. వారికి చేయూతను అందించకపోగా సోలార్ ఏర్పాటు చేసుకోకపోతే అందించిన కొద్దిపాటి సాయాన్ని వెనక్కి చేయాలనే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. జిల్లాలోని తుని మండలంలో 23, గండేపల్లిలో 33, కోరుకొండలో 33, రంగంపేటలో 27, పిఠాపురంలో 25, రాజానగరంలో 11, గొల్లప్రోలులో 11, రాజమహేంద్రవరం గ్రామీణంలో 6, సామర్లకోటలో 9, బిక్కవోలులో 4, పెద్దాపురంలో 2, కిర్లంపూడిలో ఒకటి చొప్పున విద్యుత్తు ఆధారిత బోర్లు నిర్మించారు. గతంలో రూ.24 వేలు చొప్పున ప్రభుత్వం తొలి విడత నగదు సాయం కింద వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. బోర్టుల నిర్మించుకునేందుకు రైతులు రూ.లక్షల్లో ఖర్చు చేశారు. తొలుత కొద్ది మొత్తంలో అందించిన సొమ్మును తిరిగితీసుకుంటామన్న ప్రకటనలు వస్తుండడంతో బోర్లు వేసుకున్న కర్షకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్ధిక కష్టాల నుంచి తమను గట్టెక్కించాల్సిన ప్రభుత్వం ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటే తమపై మరింత భారం పడుతుందని రైతులు అంటున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: