సేవ‌కు ఏదీ ఫ‌లితం..!

0

స‌మాజంలో న‌ర్సుల‌ది ప్ర‌త్యేక స్థానం.. అందుకే ప్ర‌పంచ వ్యాప్తంగా వారిని సిస్ట‌ర్స్ అని పిలుస్తున్నారు. డాక్ట‌ర్ వైద్యం చేసి వెళ్లిపోతే నిత్యం రోగికి స‌ప‌ర్య‌లు చేస్తూ వారి ఆరోగ్యం మెరుగుప‌ర‌చ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు. అందుకే సేవ‌కు ప్ర‌తిరూపంగా న‌ర్సుల‌ను భావిస్తంటారు. అంత‌టి సేవ చేసే న‌ర్సుల‌పై ఈ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం చూపుతోంది. వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డంలో అల‌స‌త్వం వ‌హిస్తోంది. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 98 మంది (ఎంపీహెచ్ఏడ‌బ్ల్యు) మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్స్ (న‌ర్సుల‌లో ఓ విభాగం) ఉన్నారు. వీరు యూరోపియ‌న్ క‌మిష‌న్ కింద ప‌నిచేస్తున్నారు. 2009 జూలై 22 నుంచి వీరు ప‌ని చేస్తున్నారు. అప్ప‌టి నుంచి త‌మ‌ను ప‌ర్మినెంట్ ఉద్యోగులుగా చేయాల‌ని పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫ‌లితం లేదు.
విధులు ఎక్కువ‌..జీతం త‌క్కువ
వీరు రోజూ తాము ప‌నిచేస్తున్న ఆస్ప‌త్రి ప‌రిధిలోని ఏరియాల‌లో ప‌ర్య‌టించాలి. గ‌ర్భిణులు, చిన్న‌పిల్ల‌లు, బాలింత‌లు, ఇత‌ర రోగుల‌ను గుర్తించాలి. వారికి స‌బంధించిన రికార్డులు రాసుకోవాలి. టెస్టులు చేయాలి. ఆస్ప‌త్రుల‌కు రెఫ‌ర్ చేయాలి. రికార్డుల‌న్నీ ఆన్‌లైన్ చేయాలి. అదేవిధంగా స్కూళ్లు, సీజ‌న‌ల్‌గా వ‌చ్చే డెంగ్యూ, మ‌లేరియా నిర్మూల‌న‌కు, ప‌ల్స్‌పోలియో మెడిక‌ల్‌ క్యాంపులు ఏర్పాటు చేయాలి. ఎన్‌సీసీ క్యాంపులు, ప‌రీక్ష కేంద్రాల వ‌ద్ద శిబిరాలు ఏర్పాటు చేసి సేవ‌లందించాలి. ఇవిగాకుండా టిబి, లెప్ర‌సీ స‌ర్వే చేయాలి. ఇంత‌చేస్తున్నా క‌నీసం టీఏ, డీఏలు కూడా ఇవ్వ‌డం లేదు. అంతేగాక ఔట్‌రీచ్ అమౌంట్ ఏడాదికి 3600 ఇవ్వాల్సి ఉంది. రెండేళ్లుగా ఇచ్చింది లేదు. పైలేరియా ప్రోగ్రాం అమౌంట్ కూడా ఆరేళ్లుగా అంద‌నేలేదు. మెడిక‌ల్ ఆఫీస‌ర్ దీనిగురించి ప‌ట్టించుకున్న దాఖ‌లాలు లేవు. ఇదిలా ఉండ‌గా జీవో ప్ర‌కారం వీరికి నెల‌కు 32వేల వేత‌నం ఇవ్వాలి. అలాచేయ‌కుండా ప్ర‌భుత్వం వీరి శ్ర‌మ‌ను దోచుకుంటోంది. కేవ‌లం ప‌ది వేల రూపాయ‌ల వేత‌నంతో స‌రిపెడుతోంది. చాలీచాల‌ని జీతంతో కుటుంబాల‌ను పోషించుకోవాల్సిన ప‌రిస్థితి. ప్ర‌భుత్వం స్పందించి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని మ‌ల్టీ ప‌ర్ప‌స్ హెల్త్ వ‌ర్క‌ర్స్ కోరుతున్నారు.

Share.

Leave A Reply

%d bloggers like this: