కేటీఆర్‌కు చిరంజీవి క్ష‌మాప‌ణ..!

0

మంత్రి కేటీఆర్‌కు మెగ‌స్టార్ చిరంజీవి క్ష‌మాప‌ణ చెప్పార‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా వెల్ల‌డించారు. ఇంత‌కీ విష‌యం ఏమిటంటే? ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగును మాతృభాష అనడానికి గల కారణాన్ని వివరించారు. మన ఆలోచన, మన కళ ఏ భాషలో ఉంటుందో అదే మన మాతృభాష అని చెప్పారు. తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు. ఈ సందర్బంగా తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు తన ఇంటికి వచ్చిన మంత్రి కేటీఆర్‌తో జరిగిన సంభాషణ గురించి వివరించారు. తెలుగు మహాసభలకు తనను ఆహ్వానించేందుకు ఇంటికి వచ్చారని, ఆయనకు అవార్డు వచ్చిన విషయం తెలిసి ఇంగ్లిష్‌లో అభినందించానని అన్నారు. అయితే వెంటనే స్పందించిన కేటీఆర్.. ‘అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చా.. తెలుగులోనే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా’’ అన్నారని, దీంతో ఆ వెంటనే కేటీఆర్‌కు క్షమాపణ చెప్పేశానని తెలిపారు. దానికి కేటీఆర్ ‘‘లేదన్నా.. జస్ట్ జోకింగ్’’ అని అన్నారని, ఆయన తమాషాగా అన్నా నాలో మాత్రం ఆ భావన కలిగిందని చిరంజీవి వివరించారు. తాను కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని చూశానని, అధికారులు హిందీలో మాట్లాడుకుంటారని, తమిళులు తమిళంలో మాట్లాడుకుంటారని, ఒక్క తెలుగువారు మాత్రం ఇంగ్లిష్‌లో మాట్లాడుతుంటారని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. దీనిలో మార్పు రావాల‌ని ఆకాంక్షించారు.

Share.

Leave A Reply

%d bloggers like this: