త్వరలో రూ.2,000 నోట్లకు చరమగీతం..!.?

0

కేంద్రంలోని మోదీ సర్కారు త్వరలో రూ.2,000 నోట్లకు చరమగీతం పాడనుందా…? తదుపరి డీమోనిటైజేషన్‌ ఇదే కానుందా..? అవునో, కాదో కానీ, రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా రూ.2,000 నోట్లను వెనక్కి తీసుకోవచ్చని లేదా అధిక విలువ కలిగిన నోట్ల ముద్రణను నిలిపివేయవచ్చంటూ ప్రభుత్వరంగంలోని ఎస్‌బీఐ బ్యాంకు ఎకోఫ్లాష్‌ నివేదిక పేర్కొంది. ‘‘పెద్ద నోట్ల రద్దు అనంతరం వెంటనే మార్కెట్లో ద్రవ్య లభ్యత కోసం రూ.2,000 నోట్లు తీసుకురాగా, లావాదేవీల పరంగా సవాళ్లకు దారితీసింది. దీంతో ఆర్‌బీఐ రూ.2,000 నోట్లను ప్రింట్‌ చేయడం ఆపి ఉంటుంది. లేదా తక్కువ సంఖ్యలో ముద్రించి ఉంటుంది. దీని ప్రకారం చూస్తే చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో చిన్న నోట్ల వాటా 35 శాతానికి చేరింది’’ అని నివేదిక స్పష్టం చేసింది. ‘‘మా పరిశీలన ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.3,50,100 కోట్ల విలువ మేర చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. డిసెంబర్‌ 8 నాటికి చలామణిలో ఉన్న మొత్తం నోట్లలో చిన్న నోట్ల విలువను మినహాయించి చూస్తే పెద్ద నోట్ల విలువ రూ.13,32,400 కోట్ల మేర ఉన్నట్టు తెలుస్తోంది.
ఆర్థిక శాఖ ఇటీవల లోక్‌సభలో వెల్లడించిన సమాచారం మేరకు ఆర్‌బీఐ ఈ ఏడాది డిసెంబర్‌ 8 నాటికి రూ.500 నోట్లను 16,957 పీసుల మేర ప్రింట్‌ చేసింది. రూ.2,000 నోట్లను 3,654 పీసుల మేర ప్రింట్‌ చేసింది. ఈ నోట్ల మొత్తం విలువ రూ.15,78,700 కోట్లు. ఇందులో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువ రూ.13,32,400ను మినహాయించి చూస్తే రూ.2,46,300 కోట్ల విలువ మేర పెద్ద నోట్లను ఆర్‌బీఐ ప్రింట్‌ చేసినప్పటికీ మార్కెట్లోకి పంపిణీ చేయలేదు’’ అని ఈ నివేదికను రూపొందించిన ఎస్‌బీఐ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్‌ వివరించారు. అయితే, రూ.2,46,300 కోట్ల మేర రూ.50–200 మధ్య నోట్లను ఆర్‌బీఐ ఈ మధ్య కాలంలో ప్రింట్‌ చేసి ఉంటుందని కూడా ఎస్‌బీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది.

Share.

Leave A Reply

%d bloggers like this: