ప్ర‌త్యేక హోదా ఇవ్వండి ప్లీజ్‌

0

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు నాటి ప్రధాన మంత్రి రాజ్యసభలో ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. బడ్జెట్‌ తయారీలో భాగంగా బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సంప్రదింపుల సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొని మూడు పేజీల వినతిపత్రం ఇచ్చారు. ‘బాగా అభివృద్ధి చెందిన రాజధానిని కోల్పోయాం. నూతన ఆంధ్రప్రదేశ్‌కు వైవిధ్యభరితమైన తయారీ పరిశ్రమలు లేవు. మౌలిక వసతులను అభివృద్ధిపరచాల్సిన అవసరం ఉంది. అందువల్ల ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు, తద్వారా ఉపాధి లభిస్తుంది. ప్రత్యేక హోదా గల రాష్ట్రాలకు సాధారణ రాష్ట్రాలకు మధ్య 14వ ఆర్థిక సంఘం ఎలాంటి వ్యత్యాసం చూపలేదన్న కారణంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం చెబుతోంది. అయితే కేవలం పన్నుల వాటా పంపిణీలోనే ఈ వ్యత్యాసం చూపలేదు తప్ప మిగిలిన అంశాల్లో కాదు. ఈ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం న్యాయమైన చర్య అవుతుంది..’ అని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చి జిల్లా అభివృద్ధికి కేంద్రం దోహదపడాలని వైవీ విజ్ఞప్తి చేశారు.
హోదా కోరుతూ వాయిదా తీర్మానం
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు చేయాలన్న అంశంపై చర్చించేందుకు వీలుగా వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు వైఎస్సార్‌ సీపీ బుధవారం లోక్‌సభలో నోటీసు ఇచ్చింది. పార్టీ విప్‌ వైవీ సుబ్బారెడ్డి ఈ నోటీసు ఇచ్చారు. అయితే స్పీకర్‌ వాయిదా తీర్మానం నోటీసులను తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రివిలేజ్‌ కమిటీ సమావేశం
వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలబడి ఎంపీగా గెలిచిన కొత్తపల్లి గీత పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరడంపై విచారణ చేపట్టేందుకు ప్రివిలేజ్‌ కమిటీ బుధవారం సమావేశమైంది. పార్టీ ఫిరాయించినందున ఆమె సభ్యత్వంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ప్రివిలేజ్‌ కమిటీకి ఈ ఫిర్యాదును పంపారు.
నేడు స్పీకర్‌కు లేఖ
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యుల సభ్యత్వాలను రద్దు చేసినట్టుగానే లోక్‌సభ ఎంపీలపై కూడా ఇదేరీతిలో చర్య తీసుకోవాలని కోరుతూ గురువారం లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు లేఖ రాయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Share.

Leave A Reply

%d bloggers like this: